బ్యాంక్ ఉద్యోగి నిర్వాకం.. లోన్లు రికవరీ చేశారు..  బ్యాంకులో జమ చేయలేదు.. 

బ్యాంక్ ఉద్యోగి నిర్వాకం.. లోన్లు రికవరీ చేశారు..  బ్యాంకులో జమ చేయలేదు.. 
  •     రూ. లక్షలు స్వాహా చేసిన ఇండస్​ఇండ్​ బ్యాంక్​ ప్రతినిధి
  •     నోటీసులు రావడంతో లబోదిబోమంటున్న రైతులు
  •     బ్యాంక్​ ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రైతుల నుంచి లోన్​ డబ్బులు రికవరీ చేసిన బ్యాంక్​ ప్రతినిధి వాటిని రైతుల ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేశాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ ప్రతినిధి చేసిన మోసంతో లోన్లు తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. బాకీ డబ్బులు ఎప్పటికప్పుడు కడుతున్నా, లోన్​ డబ్బులు కట్టాలంటూ బ్యాంక్​ నుంచి నోటీసులు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

రూ. లక్షల్లో స్వాహా.. 

కొత్తగూడెంలోని ఇండస్  ఇండ్​ బ్యాంకులో అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, ముల్కలపల్లి తదితర మండలాలకు చెందిన రైతులు ట్రాక్టర్లు కొనేందుకు లోన్లు తీసుకున్నారు. కొందరు తమ లోన్లు రెన్యువల్​ చేసుకున్నారు. వారి వద్ద ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాయిదాల ప్రకారం బ్యాంకు ప్రతినిధి దిలీప్​కుమార్​ డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా ఒక్కో రైతు వద్ద రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసి రసీదులు ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో రసీదులు ఆలస్యంగా ఇచ్చేవాడు. 

బ్యాంకు ప్రతినిధి కావడం, మూడేండ్లుగా డబ్బులు వసూలు చేసి తమ ఖాతాల్లో సక్రమంగా జమ చేస్తుండడంతో అతనిపై అనుమానం రాలేదు. ఇదే అదనుగా భావించిన దిలీప్​ 60 మందికి పైగా రైతుల నుంచి రూ.45 లక్షలకు పైగా వసూలు చేసిన డబ్బులను బ్యాంక్​లో జమ చేయలేదు. రసీదు అడిగినప్పుడల్లా ఆన్​లైన్​లో ఇబ్బందులున్నాయని, నేను పారిపోతానా? అంటూ నమ్మించాడు. కాగా, ఇటీవల బ్యాంకు నుంచి రైతులకు నోటీసులు రావడంతో స్వాహా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

దిలీప్​కుమార్​ తమ వద్ద డబ్బులు వసూలు చేసి బ్యాంకుకు కట్టలేదని, అతనిపై చర్యలు తీసుకోకుండా తమను డబ్బులు కట్టాలని వేధిస్తున్నారని బాధితులు బూరుగు సైదులు, సీహెచ్  నాగరాజు, గంజి వెంకటేశ్వర్లు, ఎస్  సరోజిని వాపోయారు. ఈ విషయమై బ్యాంక్​ మేనేజర్​ బాలాజీ మాట్లాడుతూ.. దిలీప్​కుమార్​ రైతుల వద్ద లోన్ల డబ్బులు రికవరీ చేసి స్వాహా చేసిన విషయం ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు 
తెలిపారు.